మానవత్వం స్వధర్మ పాలనగా
వందేమాతరం వందేమాతరం…
పరుచుకొన్న వెలుగునకు అర్థం ముగిసిన సంధ్యలేనని…ఉప్పెనై కదిలింది
ఒక పర్వత సహనం… భావి భారతమే
రేపటికి సూర్యదయమై నిన్నటి నిజాల
మొగ్గలు నేటికి పూవై వికసించాలని…
నడిచేను నవయుగానిక మార్గదర్శకుడై…
అహింసా పరమోత్తమ ధర్మమని…
రేకెత్తిన ప్రభంజనమే కోటి దారులకు
పిలుపని…అలుముకొన్న చీకటితో
అస్తమించక విలువలు కలిగిన స్థానం
ప్రాధాన్యతలతో బతకాలని…ఊతకర్ర
అడుగులతో ఉద్యమించెను జాతిపితగా…
ప్రగతి నాడి తెలియని ప్రజాస్వామ్యం
నెత్తుటి మడుగులతో నిండరాదని…
అడుగులతో కూడిన మనుషుల
మానవత్వం స్వధర్మ పాలనగా నడువాలని
పరాయి పాలనలోని బానిస బతుకులను
బతుకు కొమ్మలుగా పూయించుటకు…
స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని పిడికిలి చైతన్యమై
నడిపించేను…
ఆశయ సాధనతో అభ్యుదయమై…
తలుపు తట్టిన నైతికకు ఆంతరంగిక
ద్వారమవుతు కదిలించేను అందరి
మనస్సుల సమభావనను…సత్యాగ్రహ
సందేశాలతో శాంతి సహనాలే ఆయుధమని
కలిసి నడిచిన ఐకమత్యమే సహజీవనానికి
సాధింపని తరతరాలకు భావమై నిలిచేను…
-దేరంగుల భైరవ