బలగం సినిమా సమీక్ష

బలగం సినిమా సమీక్ష

 

ఒక చిన్న పల్లెటూరు లో ఒక ముసలి వ్యక్తి. అందరితో కలుపు గొలుగా మాట్లాడుతూ, ఉషారుగా ఉంటాడు. జోక్స్ వేస్తూ,నవ్వుతూ,నవ్విస్తూ ఉండే ఆ ముసలాయన పేరే కొమరయ్య. ఇద్దరు కొడుకులు,ఒక కూతురు,

పెద్ద మనవడు సాయిలు , అతనికి పదిహేను లక్షలతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సాయిలు ఎన్నో బిజినెస్ ల కోసం అదే ఊర్లో ఉన్న ఒక పెద్దాయన దగ్గర పది లక్షలు అప్పు తీసుకుంటాడు. అతను బెదిరిస్తాడు. దాంతో సాయిలు ఎలాగైనా ఆ అప్పు తీర్చాలి తన పెళ్లి ద్వారా అని అనుకుంటారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

అదే రోజు మధ్యాహ్నం సాయిలు కి ఒక విషాదమైన వార్త తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ తాత చనిపోయాడు అని దాంతో సాయిలు కుప్పకూలిపోతాడు. తాత చనిపోతే తన ఎంగేజ్మెంట్ ఆగిపోయి, అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తారు ఇజ్జత్ పోతుందని భయపడుతూ ఉంటాడు.

తాత చనిపోయిన బాధకన్నా తన ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అన్న బాదే అతన్ని కలచి వేస్తుంది. మరోవైపు చావుకు సాయిలు తో ఎంగేజ్మెంట్ చేసుకున్న కుటుంబం వాళ్లు వస్తారు అప్పుడు సాయిలు తాత చెల్లె వాళ్ళని చూస్తూ ఇంట్లో అడుగు పెట్టకు ముందే ఒక సావు చూసినావు, ఇక పెండ్లి ఇంట్లో అడుగుపెడితే ఇంకెన్ని అనర్ధాలు జరుగుతాయో అని అంటుంది.

దాంతో వాళ్లకి వీళ్ళకి గొడవ జరిగి ఆలుమకి సంబంధం వద్దని క్యాన్సల్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక సాయిలు దాంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఊర్లోని వాళ్ళందరూ అతని దగ్గర చేరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇరవై ఏళ్ల క్రితం దూరమైన అతని కూతురు అతని చనిపోయాక వస్తుంది అది చూసి అందరూ బాధపడి ఆమెను ఓదారుస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటి అల్లుడికి పెద్ద బావమరిదికి అసలు పడదు ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. అసలు పలకరించుకోరు ,మాట్లాడుకోరు.

అయితే వాళ్లు అయితే రెండో కొడుకు సూరత్ లో ఉంటాడు కాబట్టి అతను వచ్చేవరకు శవాన్ని ఆపుదామని అనుకుంటారు. అందరూ బాధలో ఉండి చనిపోయాడు అనుకుంటుంటే సాయిలు మాత్రం తన పెళ్లి వాయిదా పడిందని బాధలో ఉంటాడు. అతని ముగ్గురు స్నేహితులు అతనికి సపోర్టుగా ఉంటుంటారు.

ఇంతలోనే సాయిలు వాళ్ళ నాన్నకు వాళ్ళ బావకు గొడవ జరుగుతుంది. ముసలయాన్ని  బాగా చూసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు వీళ్ళు బాగా చూసుకోలేదు అని అనడంతో గొడవ జరుగుతుంది. ఇంకా అప్పటినుంచి మూడో రోజు పిట్టకు పెట్టాలని అనుకున్న సమయంలో కాకి రాదు. దాంతో అల్లుడు చూశారా నేను చెప్పలేదా ముసలోని సరిగా చూసుకోలేదు అందుకే పిట్ట రావడం లేదు అని ఎగతాళి చేస్తాడు.

దాంతో మళ్లీ గొడవ అవుతుంది.దాంతో పెద్ద బావమరిది సరే మాకైతే రాలేదు. మేము మంచిగా చూసుకోలేదు. అల్లుడు కదా నువ్వు ఎంత బాగా చేస్తావో మేము చూస్తాం అని అంటాడు. మీరు రెండు మేకల తోటి సరిపెట్టిండ్రు, నేను పది మేకలు కోస్తా అని అల్లుడు చాలెంజ్ చేస్తాడు.

ఆ చూద్దాం అది కూడా అని అందరూ గొడవపడతారు. అనుకున్నట్టే ఐదవ రోజు అల్లుడు పది మేకలు తెప్పించి ఉరందరికి భోజనాలు పెట్టించి మళ్లీ తాత సమాధి దగ్గరికి వెళ్లి వండిన వంటలన్నీ అక్కడ ఒక ఇస్తరాకులో పెట్టి పెద్ద బ్రాండ్ సీసా మందు ,కల్లు పెట్టి బాగా మొక్కుతారు.

యినా కూడా కాకి వచ్చినట్టే వచ్చి ఏది ముట్టుకోకుండా వెళ్ళిపోతుంది. దాంతో మళ్లీ ఇంకొకసారి వెళ్లి అల్లుడు మంచిగా దండం పెట్టుకొని వస్తాడు. అయినా కూడా కాకి రాదు. వాళ్లు చాలాసేపు ఎదురు చూస్తారు. అయినా కాకి కూడా ముట్టుకోదు. అప్పుడు పెద్ద బామ్మర్ది ఓ అల్లుని ప్రేమ అలుగులు పారుతుంది అని ఎద్దేవా చేస్తాడు. దాంతో అల్లుడు ఇదేనా మీ మర్యాద, ఏం మర్యాద ఇది. వెళ్ళిపోదాం పదండి అని అంటాడు.

అతనికి ఒక కూతురు ఉంటుంది ఆమె పేరు సంధ్య. ఆమెనే హీరోయిన్. ఇక భర్త అలా అనడంతో కొమురయ్య కూతురు మహాలక్ష్మి బాగా ఏడుస్తుంది. . పాపం భార్య ఏడుపు చూసినా అతను ఇక ఏమీ అనకుండా బాధను ఒక్కడే వెళ్లిపోతాడు. తర్వాత మేనత్త సాయి ని పిలిచి ఇంట్లో బట్టలు ఉన్నాయి తీసుకురా పో అని పంపిస్తుంది. వేరే ఆలోచనలో ఉన్న సాయిలు, సంధ్య ని ఏమాత్రం పట్టించుకోకుండా తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్లాక అక్కడ తన మామ ఎంత పెద్ద ధనవంతుడో చూసి ఆశ్చర్యపోయి ఇంకా అప్పటినుంచి సంధ్నియ ప్రేమిస్తుంటాడు.

కానీ ఈ ప్రేమకు కారణం డబ్బు ఎలాగైనా తన అప్పు తీసుకోవాలి కాబట్టి సంధ్య ని పెళ్లి చేసుకుంటే తన అప్పులన్నీ తీరుతాయి అని సాయిలు అభిప్రాయం. దాంతో ఆ చావు ఇంట్లోనే ఆమెకు లైన్ వేస్తూ ఉంటాడు. కానీ ఈ లోపు మళ్ళీ అల్లుడికి సాయిలు వాళ్ళ నాన్నకి ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉంటాయి.

ఇంకా పిట్ట కూడా ముట్టకముందే తమ్ముడు ఆస్తి అడుగుతాడు. అతని భార్య కూడా తమ ఆస్తి తమకు ఇవ్వమని అంటుంది. ఎందుకంటే ఆ ఆస్తిలో వాళ్లు కొమరయ్యకు సమాధి కట్టాలని నిర్ణయం చేసుకుంటారు. అందువల్ల పొలంలో సమాధి కట్టడం వల్ల తమ పొలాన్ని ఎవరూ కొనరని సమాధి కట్టొద్దని గొడవపడతారు.

తమ్ముడి భార్య తమ్ముడు ఆ పొలం కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు పొలంలో సమాధి కట్టొద్దు అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడతారు.

అది చూసినా అల్లుడు చూశారా ఇంకా పిట్టగూడా ముట్టకముందే ఆస్తులు పంపకాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు ఆ ముసలాయని ఎంత సతాయించి ఉంటారు అని ఎద్దేవా చేస్తాడు. దాంతో మళ్ళీ గొడవ జరిగి అల్లుడు వెళ్ళిపోతాడు. అయితే అప్పటివరకు అతని పక్కనే ఉన్న కొమురయ్య ఇంకొక తమ్ముడు వాళ్లని ఆపి ముందైతే పిట్ట ముట్టని తర్వాత అస్థి పంపకాలు చూసుకుందాం. ఇదేనారా మీరు నేర్చుకున్న తెలివి ఇదేనా మీకు మీరు మీ అయ్యకు ఇచ్చే గౌరవం అని వాళ్ళని తిట్టి వాళ్లకి సర్ది చెప్తాడు.

అందరూ ఒకటవ్వాలి అని అనుకున్న సాయిలు ఒక ప్లాన్ ఆలోచించి తన స్నేహితునితో కొమరయ్య అందరికీ దెయ్యమై  పట్టాడు అని చాటింపు వేయిస్తాడు. ఎందుకంటే రెండో, మూడో రోజు ,ఐదో రోజు ఊర్లో అందరూ మేకల మాంసం తిన్నారు. కాబట్టి అందరికీ మోషన్స్ పట్టుకుంటాయి. అందరూ చాలా అనారోగ్యం పాలు అవుతారు. కాబట్టి ఇదే అదునుగా తీసుకున్న సాయిలు తన ఫ్రెండ్ తో గొడవ పడినట్టు నటించి అందర్నీ పంచాయతీకి పిలుస్తాడు.

ఎందుకంటే ఇలాగైనా అందరూ ఒకటి అవుతారు అని, ఇక పంచాయతీకి అందరూ వచ్చిన తర్వాత మీ కొమరయ్య ఇంకా పిట్ట ముట్టలేదు అంటే మీ ఊరికి దేయ్యంలా అందరికీ పట్టాడు. కాబట్టి అతని కోరిక ఏంటో తెలుసుకొని అతని శాంతింప చేయండి. లేదంటే మిమ్మల్ని అందరిని ఊర్లోంచి బహిష్కరించడం జరుగుతుంది అని చెప్తారు. పదకొండో రోజు గనుక పిట్ట ముట్టకపోతే మీరు ఊర్లోంచి వేలి వేయబడతారు అని గ్రామపంచాయతీ వాళ్ళు నిర్ణయిస్తారు.

దాంతో ఎవరికీ ఏం చేయాలో అర్థం కాదు.. మామ, తండ్రి  కొట్లాడుకోవడం గమనించిన సాయిలు తన రెండో తాతను పీల్చుకొని వెళ్లి మందు తాగిస్తూ. వీళ్ళు ఇద్దారు శత్రువులుగా  లాగా మారారు ఏంటి సంగతి, ఏముంది కత అని అడుగుతాడు. అప్పుడే ముసలాయన ఏ పోనీతి అది ఎప్పుడో జరిగిపోయిన విషయము  ఇప్పుడు ఎందుకు అని అంటాడు. అయినా కూడా సాయిలు చెప్పమని పట్టుబట్టడంతో, అతను చెప్తాడు. ముందు మీ నాయన మీ మామ ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు,. సంవత్సరంలోపే మీ అత్త కడుపుతో మొదటి దసరా పండుగ కు ఇంటికి పిలిచారు. మర్యాదలు బాగానే చేశారు అందరూ మంచిగానే ఉన్నారు.

అయితే ఒక రోజు రాత్రి వాళ్ళందరూ మందు తాగుతూ తింటున్న సమయంలో ఊరి వాళ్ళు ఎవరో వచ్చారు. అప్పుడు మీ నాన్న మీ బాబాయి ఇద్దరూ లేచి బయటకు వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుoటే ఇక్కడ ఒంటరిగా కూర్చున్న మీ నాన్నకు అది అమర్యాదగా అనిపించింది. ఎందుకంటే ఒక ఊరి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ తాను ఎప్పుడూ ఎప్పటికి ఎప్పుడో ఒకసారి వచ్చి పోయి అల్లుడు మర్యాద చేయలేదని.

అలాగే తింటున్న సమయంలో ములుగు బొక్క తనకి కాకుండా తన భార్య  అన్న అడగడంతో అన్నకు వేస్తుంది మహాలక్ష్మి. ఇంటి అల్లునికి మర్యాద ఇవ్వకుండా వాళ్లది వాళ్లే తింటూ తనని అగౌరవపరుస్తున్నారని అనుకున్న మీ మామ గొడవపడి మీ అత్తను కొట్టాడు.  మా ముందే మా చెల్లిని కొడతావా అంటూ మీ నాన్న అతనితో గొడవపడ్డాడు. దాంతో మీ మామ మీ అత్తను తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్లిపోయిన వాడు ఇప్పుడు మీ తాత చనిపోయిన తర్వాతనే వచ్చాడు. అని చెప్తాడు.

ఇంతకీ సాయిలు అంతరార్థం ఏంటంటే ఇలా కొట్టుకుంటే తనకు తన మరదలికి పెళ్లి జరగదని, వాళ్ళని ఎలాగైనా కలపాలని ఆలోచనతో ఉంటాడు. అందువల్లే ఈ గ్రామపంచాయతీ ప్లాన్ వేసి తన ఫ్రెండ్ తో గొడవపడి వాళ్ళందరూ ఒకటయేలా చేయాలి అని అనుకుంటాడు. అలా కొమరయ్య కోరిక ఏంటో అని ఆలోచిస్తున్న అందరికీ దసరాకి అత్త మామ ఇచ్చిన మాటను గుర్తు చేస్తాడు సాయిలు.

తన ఇంకో తాతతో కలిసి నిజంగానే అంటే మరదలు ఇచ్చి పెళ్లి చేస్తే తాత కోరిక తీరుతుంది. అని అందరూ అనడంతో ఇక నారాయణ కూడా ఏమీ అనలేక సరే మీ ఇష్టం అంటాడు. అంటే ఇక్కడ హీరో కి హీరోయిన్ కి పెళ్లి కుదిరింది. దాంతో సాయిలు చాలా సంతోషపడతాడు.ఇక సమయం దగ్గర పడుతుంది.

మళ్లీ ఎప్పటిలాగే అన్ని రకాలుగా వంటలు చేసి కొమరయ్య సమ్మ సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ పెట్టి కూర్చుంటారు అందరూ, ఎంతసేపైనా ఒక పిట్ట కూడా రాదు అప్పుడు మళ్ళీ ఐలయ్య పాట పాడుతూ  పాడేవాళ్లు మీ కొమురయ్యే మాతోటి ఈ మాటలు అనిపిస్తున్నాడు కావచ్చు, అనుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చెప్తాడు. పెద్ద కొడుకు ఐలయ్య, నువ్వు ఇంటికి పెద్దోడివి అన్ని రకాలుగా చూసుకోవాలి.

నువ్వు పుట్టినప్పుడు నా ఇంటికి పెద్దకొడుకు అనుకున్న, గుండెల మీద పెట్టుకొని సాదుకున్న,  రెండో కొడుకును మంచిగా చదువు చెప్పిన,  మీ ఇద్దరికీ మంచి భార్యలను తెచ్చి చూడసక్కగున్నారని మురిసిపోయిన. బిడ్డ మహాలక్ష్మి నా ఇంటి మహాలక్ష్మిని అల్లుడా నారాయణ నీ చేతిలో పెట్టాను. అంటూ పాట ద్వారా వాళ్ళందరి కళ్ళు తెరిపిస్తారు.

అక్కడ పాడేవాళ్లు. ఈ పాట వస్తున్న సమయంలోనూ, మిగిలిన సమయంలోనూ మనకు ఏడుపు రాక తప్పదు. పాట అయ్యేంత లోపల సాయిలు అంటే హీరో ప్రియదర్శి ఒక సంచి తో వస్తాడు. అంతకు ముందు ఒక సీన్ లో తాత మంచం దగ్గర కూర్చొని హీరో బాగా ఏడుస్తాడు.

ఎందుకంటే దూరమైన వాళ్ళు అందరూ దగ్గర అవ్వాలని తాత కోరుకుంటాడు. ఆ విషయం ఆ రెండో తాత ద్వారా తెలుసుకున్న సాయిలు తన తాత గొప్పదనాన్ని గురించి తెలుసుకొని అతని కోరిక తెలుసుకొని బాగా ఏడుస్తాడు. తాత యాదికి వస్తుండు అంటూ గుండెలు పలికేలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనకు కన్నీళ్లు రాక తప్పదు.

ఇక చివరికి పాట అయిపోతున్న సమయంలో ఒక ఎర్ర సంచి తో వచ్చినా సాయిలు అందులో ఉన్న వస్తువు తీసి అక్కడ పెడతాడు. అది చూసిన మిగిలిన వారు అదేంటో తెలుసుకోవాలని వచ్చి చూస్తారు. అది ఒక ఫోటో మొట్టమొదటిసారి దసరాకి వచ్చినప్పుడు అల్లుడు, బిడ్డ, ఇద్దరు కొడుకులు కోడండ్లు తో కొమురయ్య దిగిన ఫోటో అది. ఆ ఫోటోలో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా అందరూ కలిసి ఉండాలనేది అతని కోరిక. కొమురయ్య అలా కోరుకున్నాడు కాబట్టే ఇప్పటివరకు పిట్ట వచ్చి ఏమీ తినలేదు..

ఇప్పుడు ఆ ఫోటోతో పాటు అందరూ పాటతో ఒకటవుతారు. నిజాలు గ్రహిస్తారు. తమ మధ్య ఉన్న గొడవలు అన్నీ మర్చిపోయి అందరూ ఒకటవుతారు. అప్పుడు కాకులన్నీ వచ్చి ఆహారాన్ని తింటాయి. ఇక చివర్లో వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు బయట మంచంలో కూర్చున్న కొమరయ్య  వారిని చూస్తూ అందరూ బాగుండాలి అని అనుకోవడంతో సినిమా ముగుస్తుంది.

ఒక చిన్న పాయింట్ అంటే ముసలాయన చనిపోవడం వల్ల జరిగే పరిణామాలు అనే ఒక చిన్న లైన్ తీసుకొని ఇంత పెద్ద కథ చేయడం వేణుకు కలిసి వచ్చిన అదృష్టం. అలాగే పల్లెటూరులో పుట్టి పెరిగిన మనకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఊర్లలో మాట పట్టింపులు ఎక్కువ ఉంటాయి. పెద్దమనిషి అయిన పిలవకపోయినా ఏ చిన్న కార్యం జరిగినా ఊర్లో అందరినీ పిలవాల్సి ఉంటుంది.

ఎవరైనా ఒకరినైనా మర్చిపోతే వాళ్లు అది మనసులో పెట్టుకొని ఆ తర్వాతే విషయాలకు ఎవరూ ముందుకు రారు. మమ్మల్ని పిలవలేదు అనే మాట పట్టింపులతో కొన్ని ఏళ్ల వరకు మాట్లాడకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు.

ఇంకా కొన్ని కులాలలో అయితే శుభకార్యమైనా. అశుభకార్యమైనా ఏదైనా పిలవకపోతే అదొక అవమానంలా భావిస్తారు. దాంతో వాళ్ళింట్లో ఇలాంటి శుభకార్యాలు జరిగిన మిగిలిన వారిని అందరిని పిలిచి, వాళ్ళ ఒక్కరిని మాత్రం పిలవకుండా ఉంటారు. ఇలాంటివి ఊర్లల్లో సహజమే అయినా ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఇంత సినిమా తీసి, బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు అనురాగాలు ఒక కుటుంబం అంటే బలగం అంటే ఎలా ఉండాలి.

ఇంటికి పెద్ద కొడుకు, కూతురు, రెండో కొడుకు ఎలా ఉండాలి తమ తల్లిదండ్రుల పేర్లు ఎలా నిలబెట్టాలి అనేది ఈ సినిమాలో కళ్ళ కట్టినట్టుగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు మన ఇంట్లోని వాళ్ళు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తాతమ్మ ,నాయనమ్మలు, అమ్మమ్మలు, చిన్నమ్మలు గుర్తుకు రావడం అనేది సహజం..

కొన్ని కొన్ని సినిమాలు ఇంతకుముందు వచ్చి కొన్ని కుటుంబాలను కలిపాయి అని పెద్దలు చెప్తారు. అలాగే ఈ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా కలుస్తారు, అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా కొన్ని వాటికి, కొన్ని ఇళ్లలో ఎన్ని మాట పట్టింపులు ఉన్నా బయట వాళ్ల ముందు ఒకటిగా ఉన్నట్లు నటిస్తారు అలా కాకుండా అందరూ స్వచ్ఛమైన మనసుతో ఉండాలని చెప్పేదే బలగం సినిమా.

ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నాను. నేనే కాదు ప్రతి ఒక్కరూ ఏడ్చే ఉంటారు. మాతృదేవోభవ సినిమా తర్వాత ఏడిపించిన సినిమా అంటే బలగమే అని నా అభిప్రాయం. మాతృదేవోభవ సినిమాకు వెళ్లిన వాళ్లందరికీ దస్తిలు పంచారట. ఈ సినిమా చూసే చూడడానికి వెళ్లే వారికి కూడా అలాగే పంచుతారానుకోవడంలో అతిశయోక్తి కాదు.

నవ్వుతూ లోపలికి థియేటర్లోకి వెళ్లిన అందరూ ఏడుస్తూ తిరిగి వస్తారు వారి గుండెలు బరువెక్కుతాయి. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లయితే మరొకసారి చూడండి మళ్లీ మీకు కన్నీళ్లు రాక తప్పదు నేను ఇప్పటికి రెండుసార్లు చూశాను. ఏడుపు ఆపుకోలేకపోయాను.

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవరిని కించపరిచేందుకు కాదు. దూరమైన వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమా చూసి ఒక్కరైనా కలిస్తే తీసిన వేణు కల తీరినట్టే. చిన్నగా జబర్దస్త్ లో మొదలైన వేణు తర్వాత సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తూ చివరికి ఇలా సినిమా చేశాడు అంటే ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. కానీ వేణు కథను నమ్ముకుని సినిమా తీశాడు. అందరినీ ఏడిపించాడు అంటే అతను కూడా ఎంతో అనుభవించి ఉంటాడు అందుకే కదా అంతా బాగా వచ్చింది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

చివరగా ట్విస్ట్ ఏంటంటే కన్నడ సినిమా తిథి నుండి తీసుకున్న కథ ,కొన్ని మార్పులతో బలగం లాగా తెచ్చారు.అదన్నమాట , తెలంగాణ వాళ్ళం వెర్రోళ్ళు,ఏమి తెలియదు అనుకుంటారు.కానీ ఎక్కడో ఒకచోట దొరుకుతారు. అయినా సరే అందులో నటించిన నటులందరూ బాగా నటించారు కాదు జీవించారు కాబట్టి.

వేణు ఆల్ ది బెస్ట్. చెప్తూ , ఈ సారి ఇలా చేయకు ఉంటే తియ్యి,లేదంటే రీమేక్ లేదా ఇన్స్పైర్ అని చెప్పు సరేనా ..

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *